visakha steel plant package: విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజిపై సందేహాలు ఉన్నాయన్న బొత్స

- విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
- ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేకపోతే ప్రధాని సభలో గానీ, అమిత్ షా పర్యటనలో గానీ ఎందుకు ప్రకటించలేదన్న బొత్స
- ప్యాకేజీ ప్రస్తుతం ప్రలోభ పెట్టడానికే తప్ప ప్రయోజనం చేకూర్చేదికాదన్న బొత్స
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్యాకేజిపై వైసీపీకి అనుమానాలు ఉన్నాయని, సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రైవేటీకరణ వ్యూహం అమలులో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారని తాము ఖచ్చితంగా చెబుతున్నామన్నారు.
కేంద్రానికి ప్రైవేటీకరణ ఆలోచన లేకపోతే ప్రధాని మోదీ సభలో కానీ అమిత్ షా పర్యటనలో గానీ ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అడ్డు పడటం వల్లే కేంద్రం సాహసం చేయలేదన్నారు. దివాలా తీసే దశలో ఉన్న పరిశ్రమకు ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. అప్పులు తీర్చడానికి డబ్బులు ఇస్తే పరిశ్రమ ఏ విధంగా నడుస్తుందని ఆయన ప్రశ్నించారు.
కార్యాచరణ ప్రకటించకుండా ప్యాకేజీ ప్రకటించడం వెనుక మతలబు ఉందని ఆయన అన్నారు. ప్యాకేజీ ప్రస్తుతం ప్రలోభ పెట్టడానికే తప్ప ప్రయోజనం చేకూర్చేది కాదని బొత్స అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉండాలనేది తమ విధానమని అందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామని బొత్స తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రచార యావ, ఆర్భాటం తప్ప ప్రజారక్షణపై బాధ్యత లేదని అర్ధం అవుతుందని పేర్కొన్నారు.