Vasamsetty Subhash: సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం: మంత్రి వాసంశెట్టి సుభాష్

- రాజమండ్రిలో ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమం
- హాజరైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, నటుడు భానుచందర్
- ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలున్నాయన్న మంత్రి
సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని ఫిలిం చాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్గాలకు సూచించారు. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉందని, గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగులకు తగిన లొకేషన్లు ఉన్నాయని మంత్రి సుభాష్ వివరించారు. ఇక్కడ చిత్రీకరణ జరిపే సినిమాల్లో స్థానిక కార్మికులకే అవకాశం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి కార్మికుల పట్ల నిర్మాతలు చిన్న చూపు చూడడం తగదని అన్నారు.
కాగా, రాజమండ్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు భానుచందర్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, మంత్రి సుభాష్ హామీతో సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా కలుగుతోందని అన్నారు.