Naresh: మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి వివరించిన నరేశ్

- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా జవాబిచ్చిన నరేశ్
- పెద్దలు నేర్పించిన సంస్కృతిని ఫాలో అవుతున్నామని వెల్లడి
- తమ మధ్య గొడవలు వచ్చే అవకాశాల్లేవని స్పష్టీకరణ
- ఎవరి జీవితం వాళ్లు ఎంజాయ్ చేస్తున్నామని వివరణ
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మీ అనుబంధం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సీనియర్ నటుడు నరేశ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మనందరం ఒక్కటే... మనందరం ప్రేమాభిమానాలతో ఉండాలి అని మాకు మా పెద్దలు నేర్పించారు... ఇప్పటికీ మేం అదే ఫాలో అవుతుంటాం అని నరేశ్ వెల్లడించారు.
"ఎవరి ఆస్తిపాస్తులు వాళ్లకు ఉన్నాయి. ఎవరి వృత్తి వాళ్లకు ఉంది. ఎవరి జీవితాలు వాళ్లకు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఏ విధంగా చూసినా తగాదాలు వచ్చే పరిస్థితులు లేవు.... తగాదాలు రాకూడదనే కోరుకుంటాం.
ఎవరి లైఫ్ వాళ్లు ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడో ఒకసారి కలుసుకునేటప్పుడు ఆనందంగా కలుసుకుంటాం, తృప్తిగా భోజనం చేస్తాం... హాయిగా మాట్లాడుకుంటాం... జీవితానికి ఇది చాలు కదా! పెద్ద వాళ్లు మాకు నేర్పించిన కల్చర్ అది.
మేం సెట్స్ మీద కలిసినా, బయట ఎక్కడైనా కలిసినా మా అనుబంధంలో మార్పు ఉండదు. మనసులో ఏదైనా ద్వేషం, ఈర్ష్య ఉన్నప్పుడు... లేదా ఏదైనా ఆస్తి గొడవ ఉన్నప్పుడు తగదాలు వస్తాయి. మా మధ్య అలాంటివేమీ లేవు కాబట్టి, గొడవలు జరిగేందుకు అవకాశం లేదు.
ఎవరిది ఎవరూ కోరుకోవడంలేదు... అందరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. ఇప్పటికీ, ఎప్పటికీ అలాగే ఉండాలని నా కోరిక, వాళ్ల కోరిక" అని నరేశ్ వివరించారు.