Nara Lokesh: నారా లోకేశ్ ఎందుకు డిప్యూటీ సీఎం కాకూడదు?: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

- లోకేశ్ ఉప ముఖ్యమంత్రి కావాలంటూ డిమాండ్లు
- బాహాటంగా గళం విప్పుతున్న టీడీపీ సీనియర్లు
- లోకేశ్ కు ఏం తక్కువన్న వర్మ
- ఇవాళ టీడీపీకి లోకేశ్ వెన్నెముక అని వెల్లడి
- కార్యకర్తల మనోభావాలను గౌరవించడంలో తప్పులేదని స్పష్టీకరణ
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే బాహాటంగా తమ గళాన్ని వినిపించారు. ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని పార్టీ కోసం ఎంతో కష్టపడిన నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు.
తాజాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేశ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని స్పష్టం చేశారు. నారా లోకేశ్ టీడీపీ సభ్యత్వాల సంఖ్యను ఒక కోటి దాటించి చరిత్ర సృష్టించారని, అంతకుముందు, ఇక టీడీపీ పనైపోయిందన్న వారికి యువగళంతో దీటైన సమాధానం చెప్పారని వర్మ వివరించారు.
పార్టీ కార్యకర్తల మనోభావాలకు విలువ ఇవ్వాలని, ఈ విషయంలో కొన్ని మీడియా చానళ్లు, సోషల్ మీడియా తప్పుగా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.
"లోకేశ్ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని టీడీపీ శ్రేణులు అడుగుతున్నాయి... దారుణంగా ఓడిపోయిన జగన్ భవిష్యత్తు ఏంటో తెలియక కొట్టుమిట్టాడుతుంటే అతడ్ని కూడా సీఎం సీఎం అంటున్నారు... అది వాళ్ల పార్టీలో అభిప్రాయం. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను జనసేన క్యాడర్ సీఎం సీఎం అంటోంది... చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను కూడా సీఎం సీఎం అనేవారు... యువగళంలో లోకేశ్ ను కూడా సీఎం సీఎం అనేవారు... కార్యకర్తల మనోభావాలను గౌరవించడంలో తప్పులేదు. అలాంటప్పుడు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తున్న నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలనడంలో తప్పేముంది?" అని వర్మ ప్రశ్నించారు.
ఇది తాను చెబుతున్న మాట కాదని, టీడీపీలో కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం కావడానికి లోకేశ్ కు ఏం తక్కువ? పార్టీ పట్ల ఆయన నిజాయతీని, నిబద్ధతను ఎవరూ శంకించలేరు అని వర్మ పేర్కొన్నారు. ఇవాళ నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నారని కొనియాడారు.
అయితే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయం అయినా తాము శిరసావహిస్తామని వర్మ స్పష్టం చేశారు.