Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పేరు కూడా మార్చుకున్నాడు: ముంబై డిప్యూటీ కమిషనర్

- వివరాలు వెల్లడించిన ముంబై పోలీసులు
- బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించినట్లు వెల్లడి
- తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నట్లు వెల్లడి
- నాలుగు నెలలుగా ముంబైలో నివసిస్తున్నాడన్న పోలీస్ అధికారి
- ఫైర్ ఎగ్జిట్ ద్వారా సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి జొరబడినట్లు వెల్లడి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి జొరబడిన వ్యక్తిని బంగ్లాదేశీయుడిగా భావిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అతను గత కొన్ని నెలలుగా ముంబైలోనే నివసిస్తున్నాడని వెల్లడించారు. ఈరోజు ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ ఇంట్లో జొరబడిన వ్యక్తిని చోరీ కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడిని మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించినట్లు తెలిపారు.
దర్యాఫ్తు ఆధారంగా అతను బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. అతని వద్ద భారతీయుడిగా గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లేదా పత్రాలు లేవన్నారు. బంగ్లాదేశ్‌కు చెందినవాడిగానే అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. అతనిపై పాస్‌పోర్ట్ యాక్ట్ అభియోగాల కింద కూడా కేసు నమోదు చేశామన్నారు.
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా అతను బంగ్లాదేశ్‌కు చెందినవాడిగా కనిపిస్తోందన్నారు. అతను దేశంలోకి అక్రమంగా వచ్చాడని, తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గత నాలుగు నెలలుగా అతను ముంబైలో నివసిస్తున్నట్లు గుర్తించామన్నారు. ముంబైకి వచ్చాక అతను హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడన్నారు. నిందితుడిని థానేలో అరెస్ట్ చేశామని, అతన్ని ఇంకా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
ఫైర్ ఎగ్జిట్ ద్వారా లోనికి వచ్చాడు
అతను ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఇంట్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇంట్లోని పనిపనిషి గమనించి కేకలు వేసిందన్నారు. సైఫ్ అలీఖాన్ అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశాడని, దీంతో ఆ వ్యక్తి ఆరుసార్లు సైఫ్ అలీఖాన్ ను పొడిచి పారిపోయాడన్నారు. సైఫ్‌ను సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారని, అతను క్రమంగా కోలుకుంటున్నాడన్నారు.
మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం డబ్బు డిమాండ్ చేశాడని, వారు ఇవ్వమని చెప్పడంతో పాటు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దాడి చేసినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు కూడా అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.