Golden Baba: మహా కుంభమేళాలో గోల్డెన్ బాబా

- ఒంటిపై ఆరు కిలోల బంగారంతో సందడి
- వివిధ దేవతలకు గుర్తుగా ధరిస్తున్నట్లు వెల్లడి
- కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్ చైర్మన్ గా సేవలు
మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు ప్రయాగ్ రాజ్ కు విచ్చేస్తున్నారు. కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఐఐటీ బాబా, కాంటేవాలా బాబా, రుద్రాక్ష్ బాబా.. ఇలా వెరైటీ బాబాలు భక్తులకు దర్శనమిస్తున్నారు. తాజాగా కుంభమేళాలో గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ బాబా ఒళ్లంతా బంగారమే.. ఏకంగా ఆరు కిలోల ఆభరణాలను ఆయన ధరిస్తారు. ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
గోల్డెన్ బాబా అసలు పేరు మహా మండలేశ్వర్ నారాయణానంద్ గిరి మహరాజ్.. నిరంజనీ అఖాడాకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా సేవలందిస్తున్నారు. తన ఒంటిపై ధరించిన బంగారు ఆభరణాల గురించి వివరిస్తూ.. వివిధ దేవతలకు గుర్తుగా ఈ నగలను గత పదిహేనేళ్లుగా ధరిస్తున్నట్లు చెప్పారు. రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన ఈ నగల నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలిపారు. శ్రీ యంత్రంతో పాటు నగలను తాను చేసే పూజల్లోనూ వినియోగిస్తానని చెప్పారు.