Crime News: డబ్బు కక్కుర్తితో కుమార్తె అసభ్య వీడియోల విక్రయం.. తల్లిదండ్రుల అరెస్ట్

- తమిళనాడులో వెలుగులోకి సంచలన ఘటన
- కుమార్తెతోపాటు ఆమె ఆరుగురి స్నేహితులతో అసభ్యకర పనులు
- వాటిని షూట్ చేసి వీడియోల విక్రయం
- వారికి సహకరించిన మరో నలుగురి అరెస్ట్
- బాలిక తల్లిదండ్రుల ఫోన్ల నిండా కుమార్తె అసభ్య వీడియోలే
సులభంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో కన్నతల్లిదండ్రులే కుమార్తె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెతో అసభ్యకర పనులు చేయిస్తూ వాటిని వీడియో తీసి విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మైలాపూర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి రెండు మొబైల్ ఫోన్లను అప్పగించాడు. వాటిలో ఓ బాలిక అసభ్యకర వీడియోలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వాటిని ఇతరులకు షేర్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్లను పరిశీలించిన పోలీసులు ఆ వీడియోల్లో బాలికతో సన్నిహితంగా ఉన్న ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారిని విచారించగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులు ఇద్దరికీ బాలిక తల్లిదండ్రులే సాయపడ్డారని, వారే ఈ వీడియోలు తీశారని తేలింది. ఆ వీడియోలు, ఫొటోలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిపారు. నిందితుల సమాచారంతో బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఈసారి విస్తుపోవడం పోలీసుల వంతైంది.
బాలికతోపాటు ఆమె ఆరుగురు స్నేహితురాళ్ల అసభ్య వీడియోలు కూడా ఆయన ఫోన్‌లో ఉన్నాయి. వారితో బలవంతంగా ఈ పని చేయించినట్టు పోలీసులు గుర్తించారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి నుంచి రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. బాధిత బాలికలు ఇంకా షాక్‌లోనే ఉన్నారని, వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసు వివరాలను రహస్యంగా ఉంచిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.