Pawan Kalyan: ఎన్టీఆర్ వర్ధంతి వేళ ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- నేడు ఎన్టీఆర్ వర్ధంతి
- ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని, రాజకీయ జీవితాన్ని స్మరించుకున్న పవన్
- నేటి తరానికి ఆదర్శనీయం, ఆచరణీయం అంటూ ప్రకటన
నేడు (జనవరి 18) ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా సినీ రంగంలో ఆయన ప్రస్థానం, రాజకీయ రంగంలో, పేదల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను స్మరించుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.
"నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. రాజకీయ నేతగా తలంపుకొస్తే... ప్రజలకు ఆయన అందించిన సంక్షేమ పథకాలు గుర్తుకువస్తాయి. అంతటి బలమైన ముద్ర వేసిన నందమూరి తారక రామారావు తెలుగు వారైనందుకు తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఆ మహా పురుషుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన నట జీవితం, రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం, ఆచరణీయం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
