Pavala Shyamala: సీనియర్ నటికి ఆర్థిక సహాయం అందించిన పూరీ జగన్నాథ్ తనయుడు

- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామల
- ఓ వృద్ధాశ్రమంలో బతుకు ఈడుస్తున్న సీనియర్ నటి
- నేడు వృద్ధాశ్రమానికి వెళ్లి పావలా శ్యామలను కలిసిన ఆకాశ్ జగన్నాథ్
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, తదితరులు ఆమెకు సాయం అందించారు.
తాజాగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, యువ హీరో ఆకాశ్ జగన్నాథ్ కూడా పావలా శ్యామల పరిస్థితి పట్ల చలించిపోయాడు. ఆమెకు తనవంతుగా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాడు. పావలా శ్యామల ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి ఘట్ కేసర్ లోని ఉషా సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీ వారి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.
ఇవాళ వృద్ధాశ్రమానికి వెళ్లిన ఆకాశ్ జగన్నాథ్... పావలా శ్యామలను కలిసి నగదును అందించారు. ఆమెతో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు కనుక్కున్నారు. నాన్న గారి అంతటి పేరు తెచ్చుకోవాలి బాబూ అని పావలా శ్యామల... ఆకాశ్ జగన్నాథ్ ను ఆశీర్వదించారు.
కాగా, కొన్నాళ్ల క్రితం వరకు పావలా శ్యామలకు తోడునీడగా ఉన్న కుమార్తె కాలు విరిగి మంచాన పడడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పావలా శ్యామల గుండెకు రంధ్రాలతో బాధపడుతున్నారు.