Kareena Kapoor: సైఫ్ పై దాడి మాత్రమే చేశాడు... ఇంట్లో ఏమీ దోచుకోలేదు: కరీనా కపూర్

- దాడి చేసిన సమయంలో దుండగుడు ఆవేశంగా ఉన్నాడన్న కరీనా
- తాను ఎంతో కంగారు పడిపోయానని వెల్లడి
- తనకు ధైర్యం చెప్పేందుకు అక్క కరిష్మా వచ్చిందన్న కరీనా
ముంబై బాంద్రాలోని నివాసంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై డుండగుడు కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సైఫ్ భార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కరీనా కపూర్ పలు విషయాలను వెల్లడించారు.
దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని కరీనా తెలిపారు. దాదాపు ఆరు సార్లు కైఫ్ ను కత్తితో పొడిచాడని, అయితే ఇంట్లో ఉన్న వస్తువులను దొంగిలించలేదని చెప్పారు. చిన్న కుమారుడు జేహ్, కేర్ టేకర్ ను కాపాడే ప్రయత్నంలో దుండగుడితో సైఫ్ పోరాడారని... ఈ క్రమంలోనే సైఫ్ పై దుండగుడు దాడి చేశాడని తెలిపారు. దాడి తర్వాత ఎంతో కంగారుపడ్డానని, ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పారు. తనకు ధైర్యం చెప్పడానికి వెంటనే తన అక్క కరిష్మా కపూర్ వచ్చిందని... తనను ఆమె ఇంటికి తీసుకెళ్లిందని తెలిపారు.
మరోవైపు సైఫ్ పై దాడికి పాల్పడ్డ దుండగుడి కోసం పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ దొరకలేదు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. వసాయి-విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసినట్టు అనుమానిస్తున్నారు. కబూతర్ ఖానా ప్రాంతంలో ఒక మొబైల్ షాప్ లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. వైద్యులు ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ఆయన నడవగలుగుతున్నారని, సాధారణ భోజనం తీసుకుంటున్నారని చెప్పారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సైఫ్ కు డాక్టర్లు సూచించారు.