SS Thaman: అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి: తమన్
![SS Thaman Tweet on Chiranjeevi Appreciations](https://imgd.ap7am.com/thumbnail/cr-20250118tn678b5fda59f05.jpg)
- తెలుగు సినిమా విషయమై తమన్ ఆవేదన
- తమన్ చేసిన వ్యాఖ్యలు హృదయాల్ని తాకేలా ఉన్నాయన్న చిరంజీవి
- ఆయన ప్రశంసలపై స్పందించిన సంగీత దర్శకుడు
- చిరు మాటలు తనకు జీవితాంతం గుర్తుంటాయని ట్వీట్
సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తెలుగు సినిమా విషయమై ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మన సినిమాల్ని మనమే చంపేసుకుంటున్నామని అభిమానులను ఉద్దేశించి తమన్ చేసిన వ్యాఖ్యలు హృదయాల్ని తాకేలా ఉన్నాయంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అయితే, చిరు ప్రశంసలపై తమన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేక పోస్టు పెట్టారు. అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ తమన్ ట్వీట్ చేశారు.
"డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్లు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి" అని తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక శుక్రవారం నాడు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్‌లో తమన్ తెలుగు సినిమా గురించి ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. విదేశాల్లో కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుతుంటే.. మనం మాత్రం మన సినిమాను తక్కువ చేసుకుంటున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.