Nara Lokesh: తెలంగాణలో టీడీపీపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

- తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామన్న లోకేశ్
- త్వరలోనే పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని వెల్లడి
- తెలంగాణలో 1.60 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారన్న లోకేశ్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించడంపై చర్చిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. త్వరలోనే పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు.
తెలంగాణలో 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని... పార్టీపై తెలంగాణలో ఆశ, అభిమానం ఉన్నాయని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండానే ఇంతమంది సభ్యత్వాలు తీసుకోవడం గొప్ప విషయమని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగువారిని మదరాసీలు అనేవారని... అలాంటి పరిస్థితుల్లో తెలుగువారంతా మేము తెలుగువారమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ చేశారని లోకేశ్ చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతామని తెలిపారు. ఎన్టీఆర్ కు 'భారతరత్న' వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.