Chiranjeevi: నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి త‌మ‌న్‌... ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదనా?: చిరంజీవి

Chiranjeevi Tweet on SS Thaman Words about Telugu Cinema

  • 'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ స‌క్సెస్ మీట్‌లో తెలుగు సినిమా గురించి మాట్లాడిన‌ త‌మ‌న్
  • విదేశాల్లో సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నార‌న్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌
  • అలాంటిది మ‌నం మాత్రం మ‌న సినిమాను త‌క్కువ చేసుకుంటున్నామంటూ ఆవేద‌న
  • త‌మ‌న్ ఆవేద‌న‌పై తాజాగా 'ఎక్స్' వేదిక‌గా చిరంజీవి స్పందన 

'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ స‌క్సెస్ మీట్‌లో సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ త‌మ‌న్ తెలుగు సినిమా గురించి మాట్లాడిన మాట‌లు అంద‌రినీ ఆలోచింపచేస్తున్నాయి. విదేశాల్లో సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్న వేళ... మ‌నం మాత్రం మ‌న సినిమాను త‌క్కువ చేసుకుంటున్నామంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నెట్టింట ఒక వ‌ర్గం జ‌రుపుతున్న కుట్ర‌పూరిత ప్ర‌చారం కార‌ణంగా, ఇవాళ ఓ స‌క్సెస్ అయిన సినిమా గురించి ఒక‌ నిర్మాత నిర్మోహ‌మాటంగా బ‌య‌ట‌కు మాట్లాడలేని ప‌రిస్థితి దాపురించింద‌ని త‌మ‌న్ చెప్పుకొచ్చారు.   

కాగా, త‌మ‌న్ ఆవేద‌న‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి త‌మ‌న్ అంటూ చిరు ట్వీట్ చేశారు. 

"నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ, మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే. కానీ, ఆ మాట‌లు స్ఫూర్తినిస్తాయి. అలాగే నాశనం చేయగలవు. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది. నీ మాట‌లు ఆలోచింపచేస్తున్నాయి బ్ర‌ద‌ర్" అంటూ చిరు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా... నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

More Telugu News