NISG: ఏపీకి కావాల్సిన సాంకేతిక స‌హ‌కారం అందిస్తాం: ఎన్ఐఎస్‌జీ చీఫ్ ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ బన్సల్

nisg and andhra pradesh government join hands for tech innovation

  • ఏపీతో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధమన్న ఎన్ఐఎస్‌జీ
  • ఆర్టీజీఎస్‌లో ప్ర‌భుత్వాధికారుల‌తో ఎన్ఐఎస్‌జీ అధికారుల స‌మావేశం
  • త‌క్కువ ఖ‌ర్చుతోనే ప్ర‌భుత్వానికి క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసులు అందిస్తామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయడానికి తాము ఎంతో ఆసక్తితో ఉన్నామని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ‌ర్‌  స్మార్ట్ గవర్నెన్స్ (ఎన్ఐఎస్‌జీ) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ బ‌న్స‌ల్ అన్నారు. ప్రభుత్వ శాఖలకు కావాల్సిన సాంకేతిక సహకారం అందించడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు.

శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)లో ఎన్ఐఎస్‌జీ సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాజీవ్ బ‌న్స‌ల్ మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ‌ర్ స్మార్ట్ గవర్నెన్స్ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న వివిధ కార్యకలాపాల గురించి వివరించారు. ఆయా రాష్ట్రాలకు వారి అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఈ-గ‌వ‌ర్నెన్స్, స్ట్రాటజీ ప్లానింగ్‌, డిజైనింగ్ తదితర రంగాల్లో సహకారం అందించడంతో పాటు  ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలను ప్రభుత్వాలు స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవడానికి అవ‌స‌ర‌మైన సహకారం తాము అందిస్తామని చెప్పారు. 

త‌మ‌ది ఎలాంటి లాభాపేక్ష లేన‌టువంటి సంస్థ‌ని తెలిపారు. తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వానికి తాము కన్సల్టెన్సీ సర్వీసులు అందిస్తామన్నారు. గ‌త రెండు దశాబ్దాలలో తమ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 30 వేల మందికి పైగా వివిధ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కల్పించామని, 200ల‌కుపైగా ప్రాజెక్ట్‌లను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ త‌మ సంస్థకు మొట్టమొదటి ప్రమోటర్‌గా ప‌నిచేసిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మరింత దృఢమైన భాగస్వామ్యం ఏర్పరచుకుని ఏపీ ప్రభుత్వంలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించాలని, ఏపీ ప్రభుత్వానికి కావాల్సిన సాంకేతిక సహకారం అందించాలని తమ సంస్థ ఎదురు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా రూపొందించిన స్వ‌ర్ణాంధ్ర‌ 2047 లక్ష్యాల సాధన‌లో కూడా కావాల్సిన సాంకేతిక సహకారం అందించడానికి తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ఐఎస్‌జీతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉందన్నారు. ప్రభుత్వ శాఖలు తమ కార్యకలాపాలు అమలు చేసే సందర్భంలో ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌కు సాంకేతిక పరిష్కారాలు అవ‌స‌ర‌మ‌ని, ఆ దిశ‌గా ఈ సంస్థ సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే డీప్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త‌దితర‌ రంగాలపై చాలా చురుగ్గా పనిచేస్తోందని, ఈ దిశగా ఎన్ఐఎస్టీ సహకారం కూడా తీసుకుంటామన్నారు. 

ఐటీ కార్యదర్శి ఎన్‌ యువరాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో అమరావతిలో కూడా ఎన్ఐఎస్టీ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే సముచితంగా ఉంటుందని సూచించగా దానికి ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తొలుత ఎన్ఐఎస్‌టీ ప్రతినిధుల బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేశ్ కుమార్ స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News