Infosys: కుప్పకూలిన ఇన్ఫోసిస్ షేర్లు.. రూ. 1,850 కోట్లు హరించుకుపోయిన నారాయణమూర్తి కుటుంబ సంపద

- ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి కుటుంబంలోని ఐదుగురికి షేర్లు
- వాటి మొత్తం విలువ రూ. 32,152 కోట్లు
- షేర్ల పతనంతో రూ.30,300కు పడిపోయిన సంపద
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుటుంబం అతిపెద్ద ఆర్థిక వైఫల్యాన్ని చవిచూసింది. ఇన్ఫోసిస్ షేర్లు గురువారం దాదాపు 6 శాతం పతనం కావడంతో నారాయణమూర్తి కుటుంబ సంపదలో రూ. 1,850 కోట్ల మేర హరించుకుపోయింది. ఆయన కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు ఇన్ఫోసిస్‌లో 4.02 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 32,152 కోట్లు.
గురువారం ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 5.89 శాతం కుదేలు కావడంతో నారాయణమూర్తి కుటుంబ సంపదలో రూ. 1,850 కోట్లు క్షీణించి రూ. 30,300 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఒక్కో షేరు ధర రూ. 1,812 పలుకుతోంది. ఇన్ఫోసిస్ షేర్ల పతనం ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ ఆరు నెలల లాభాలు మాత్రం 5.42 శాతానికి పడిపోయాయి.