Pawan Kalyan: ఉద్యోగుల పెండింగ్ కేసులపై నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలన్న పవన్ కల్యాణ్
- ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడం ఏమిటని అసంతృప్తి
- పెండింగ్‌లో ఎన్ని కేసులు ఉన్నాయో వివరాల నివేదిక సిద్ధం చేయాలన్న పవన్ కల్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలని, వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శినిలా పని చేస్తుందన్నారు.
ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, అందుకు గల కారణాలపై సమగ్ర నివేదికను మూడు వారాల్లో అందించాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆయన ఆదేశించారు.
కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. కేసులు అపరిష్కృతంగా ఉండటం వల్ల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ తర్వాత కూడా పదవీ విరమణ ప్రయోజనాలు పొందలేకపోతున్నారన్నారు. సిబ్బంది తమ ఉద్యోగ కాల పరిమితిలో పదోన్నతుల్లోనూ వెనుకబడిపోతున్నారన్నారు. తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను ఆయన సూచించారు.