Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో అండర్ వరల్డ్ హస్తం ఉందా? అంటే మంత్రి సమాధానం ఇదీ...!

- అండర్ వరల్డ్ హస్తం కనిపించడం లేదన్న మహారాష్ట్ర హోంశాఖ మంత్రి
- ఈ ఘటన వెనుక దొంగతనం ఉద్దేశమే కనిపిస్తోందని వెల్లడి
- సైఫ్ అలీఖాన్ భద్రతను కోరితే నిబంధనల ప్రకారం ఇస్తామన్న మంత్రి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి వెనుక 'అండర్ వరల్డ్' హస్తం ఉందా?... అంటే అలాంటిదేమీ కనిపించడం లేదని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో అండర్ వరల్డ్ లేదా క్రిమినల్ గ్యాంగ్ ప్రమేయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ ఘటన వెనుక దొంగతనం ఉద్దేశమే కనిపిస్తోందన్నారు.
యోగేశ్ కదమ్ మీడియాతో మాట్లాడుతూ... సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు కలిగిన వ్యక్తికి నేర చరిత్ర ఉన్నప్పటికీ, ఈ ఘటనతో మాత్రం సంబంధం లేదని పోలీసులు గుర్తించినట్లు చెప్పారు. దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు.
క్రిమినల్ గ్యాంగ్ ప్రమేయం ఉందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడు చోరీ కోసమే వచ్చినట్లుగా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. బెదిరింపులు వచ్చినట్లుగా కూడా సైఫ్ అలీఖాన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సెక్యూరిటీ కోరలేదని, అడిగితే మాత్రం నిబంధనల ప్రకారం భద్రతను కల్పిస్తామన్నారు.