Chandrababu: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకు శ్రీకారం: సీఎం చంద్రబాబు

- సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం
- సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చ
- వివిధ పథకాల అమలుకు సిద్ధం కావాలన్న చంద్రబాబు
- పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం
వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశ ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేసిన వెంటనే, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని తెలిపారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించి, నిర్దేశిత సమయం లోపు పూర్తి చేయాలని అన్నారు. ఇక, రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.