BCCI: స్టార్ కల్చర్‌కు చెక్.. ప్లేయర్స్‌కు కఠిన మార్గదర్శకాలు విడుదల చేసిన బీసీసీఐ

- ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనన్న బీసీసీఐ
- విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం
- కీలక మార్గదర్శకాలు విడుదల చేసిన బీసీసీఐ
ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర వైఫల్యానికి ఆటగాళ్ల క్రమశిక్షణారాహిత్యం, కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని పర్యటనకు వెళ్లడం ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినడానికి ప్రధాన కారణాలంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం నాడు కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
1. ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ఫిట్‌నెస్ చక్కగా ఉంచుకోవడంతో పాటు ఆటతీరును మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, దేశవాళీ క్రికెట్ కూడా మరింత పటిష్ఠం అవుతుందని భావిస్తున్నారు.
2. విదేశీ పర్యటనలకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలంటే ముందుగా హెడ్ కోచ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ దగ్గర అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో గడపడానికి, ఇతర సడలింపుల కోసం తప్పనిసరిగా అనుమతి పొందాలి. 45 రోజుల కంటే ఎక్కువ కొనసాగే విదేశీ పర్యటనల సమయాల్లో ఆటగాళ్ల కుటుంబాలకు గరిష్ఠంగా రెండు వారాలపాటు అనుమతి ఇస్తారు. ఈ నిబంధన ఆటగాళ్లు జట్టుతో క్రమశిక్షణగా కొనసాగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
3. ఆటగాళ్లు కలిసి కట్టుగా ఉండేందుకు దోహదపడేలా... అన్ని మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు ప్లేయర్స్ అందరూ కలిసి ప్రయాణించాలని బీసీసీఐ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఇకపై మానుకోవాలి. ఏదైనా మినహాయింపులు తప్పనిసరైతే ప్రధాన కోచ్, సెలెక్షన్ కమిటీ చైర్మన్‌ల అనుమతి పొందాలి.
4. ఆటగాళ్లు సుదీర్ఘ పర్యటనలు చేసేటప్పుడు 150 కేజీల కంటే ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి వీల్లేదు. అంతకంటే ఎక్కువ బరువు ఉన్న లగేజీ తీసుకెళ్లాలంటే ఆటగాళ్లే సొంతంగా ఖర్చులు భరించాలి. కొందరు ఆటగాళ్లు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది బ్యాగ్‌లను కూడా తీసుకెళుతున్న నేపథ్యంలో ఈ నిబంధనను తీసుకొచ్చారు.
5. పర్యటనల సమయాల్లో వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్‌లు, సహాయకులు, భద్రత వంటి వ్యక్తిగత సిబ్బందిపై కూడా బీసీసీఐ ఆంక్షలు విధించింది. అనుమతి లభించిన సిబ్బంది మాత్రమే జట్టుతో ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
6. ఇకపై బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు తమ కిట్లు, వ్యక్తిగత వస్తువులను పంపేటప్పుడు ఆటగాళ్లే స్వయంగా టీమ్ మేనేజ్‌మెంట్‌తో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక ఏర్పాట్ల కోసం అనివార్యమయ్యే అదనపు ఖర్చుల భారాన్ని క్రికెటర్లే భరించాలి.
7. ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్ లో పూర్తి సమయం అందుబాటులో ఉండాలి.
8. ఏదైనా సిరీస్ లేదా పర్యటన జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు కమర్షియల్ ప్రకటనలు లేదా షూటింగ్స్‌లో పాల్గొనడానికి వీల్లేదు. జట్టుకు సంబంధించిన కార్యకలాపాలు, జట్టు షూటింగ్స్‌లో మాత్రమే పాల్గొనాలి.
9. ఇక సిరీస్ లేదా మ్యాచ్ ముందుగానే ముగిసినప్పటికీ ఆటగాళ్లు జట్టుతోనే ఉండాలి.
10. ఆటగాళ్లు బీసీసీఐ అధికారిక, ప్రచార కార్యక్రమాలు, షూట్‌లకు అందుబాటులో ఉండాలి. ఫంక్షన్‌లకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. బీసీసీఐ వాగ్దానాలకు అనుగుణంగా సంబంధిత భాగస్వాములు, క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేలా ఆటగాళ్లు సహకరం అందివ్వాలని బీసీసీఐ స్పష్టం చేసింది.