Sajjanar: అమ్మను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలే బస్‌స్టేషన్‌లో వదిలేస్తారా?: సజ్జనార్

Sajjanar responds on vikarabad issue

  • వికారాబాద్ బస్టాండ్‌లో వృద్ధురాలిని వదిలి వెళ్లిన కొడుకులు
  • ఈ కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సజ్జనార్
  • రేపు మీ పిల్లలు మిమ్మల్నీ ఇలాగే బస్టాండ్‌లో వదిలేస్తే ఎలా ఉంటుందని ప్రశ్న

అమ్మను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డలే బస్‌స్టేషన్‌లో వదిలేయడం అమానవీయమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వికారాబాద్ బస్టాండ్‌లో సోమవారం రాత్రి ఓ వృద్ధురాలిని కొడుకులు వదిలేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వార్త పత్రికల్లో వచ్చింది. డిపో సిబ్బంది ఆ వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించారు. ఆమెకు భోజనం పెట్టించి... పోలీసుల సహకారంతో కొంపల్లి అనాథ ఆశ్రమానికి తరలించారు. ఈ కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సజ్జనార్ స్పందించారు.

జీవిత చరమాంకంలో ఆ కన్నపేగుకు కనీసం తోడుగా ఉండలేరా? ఇదేం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థంతో బంధాలు, అనుబంధాలను సమాధి చేస్తూ... ఏం సాధిస్తారని ప్రశ్నించారు. పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోకుండా కర్కశంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఇలాగే బస్ స్టేషన్‌లో వదిలేసి వెళితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండని ప్రశ్నించారు. కన్నవాళ్ల నుంచి ఆస్తులు కావాలి... కానీ కన్నవారు మాత్రం అవసరం లేదనే భావన సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు. వృద్దురాలి బాధను చూసి చలించిపోయి మానవత్వంతో చేరదీసిన వికారాబాద్ డిపో ఆర్టీసీ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

More Telugu News