KTR: ముగిసిన కేటీఆర్ విచారణ... 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ

- ఈ-కార్ రేసులో ముగిసిన ఈడీ విచారణ
- రూ. 45 కోట్లు పౌండ్లుగా మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నలు
- రెండో సీజన్ లో ఏస్ నెక్స్ట్ తప్పుకోవడంపై కూడా ప్రశ్నల వర్షం
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ వెళ్లారు. ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించారు. విచారణ మధ్యలో కేటీఆర్ కు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు... భోజన విరామం అనంతరం కేటీఆర్ ను మరింత లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం.
కారు రేసు నిర్వహణలో విదేశీ కంపెనీకి కేబినెట్ అనుమతి కూడా లేకుండానే రూ. 45 కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించడంపై కేటీఆర్ ను అధికారులు ప్రశ్నించారు. నగదు బదిలీపై ప్రశ్నల వర్షం కురిపించారు. కార్ రేసు రెండో సీజన్ కు సంబంధించి హెచ్ఎండీఏను ఎందుకు పార్ట్ నర్ గా చేశారని ప్రశ్నించారు. తొలి సీజన్ లో ఉన్న ఏస్ నెక్స్ట్ ఎందుకు తప్పుకుందని అడిగారు. హెచ్ఎండీఏ నుంచి నిధుల బదలాయింపుపైనే ఎక్కువగా ఆయనను ప్రశ్నించారు. నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈడీ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ... ఆయనను ఈడీ అధికారులు ఇంటికి పంపిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించి ఆయన సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేటీఆర్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తారు. మరోవైపు, కేటీఆర్ రాక కోసం ఈడీ పరిసర ప్రాంతాల్లోకి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.