Arvind Kejriwal: సైఫ్ అలీ ఖాన్ పై దాడి... లారెన్స్ బిష్ణోయ్ ను ప్రస్తావిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

- సైఫ్ పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్ కు గురయ్యానన్న కేజ్రీవాల్
- సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే... సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్న
- మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై మండిపాటు
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన యావత్ దేశాన్ని షాక్ కు గురి చేస్తోంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ... బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ లోని సబర్మతి జైల్లో ఉన్నప్పటికీ నిర్భయంగా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్టుగా కనిపిస్తోందని చెప్పారు. ఎంతో సురక్షితమైన ప్రదేశంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నివసిస్తున్నారని... ఆయన ఇంట్లో ఆయనపై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. సైఫ్ పై దాడి జరిగిందనే విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని అన్నారు.
ముంబైలో నివసిస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతోందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. సైఫ్ పై దాడి జరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. గతంలో సల్మాన్ ఖాన్ ను అటాక్ చేశారని, బాబా సిద్దిఖీని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే... సామాన్య ప్రజల సంగతి ఏమిటని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మంచి పాలన అందించడం లేదు, ప్రజలకు రక్షణ కల్పించడం లేదని మండిపడ్డారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా స్పందించారు. ఏ ఆధారాలతో ఈ విధంగా కేజ్రీవాల్ మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో మీరు అధికారంలో ఉన్నారని... ఢిల్లీలో మీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి మాట్లాడాలని అన్నారు.