Daya Nayak: సైఫ్ అలీ ఖాన్ ఇంటిని పరిశీలించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్

- ముంబై అండర్ వరల్డ్ ను వణికించిన దయా నాయక్
- దాదాపు 80 మందిని ఎన్ కౌంటర్ చేసినట్టు సమాచారం
- దయా జీవిత కథతో సినిమాలు నిర్మించిన బాలీవుడ్
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మరోపై సైఫ్ పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
మరోవైపు, బాంద్రాలోని సైఫ్ ఇంటిని పోలీసు అధికారులు పరిశీలించారు. వీరిలో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగాంచిన దయా నాయక్ కూడా ఉన్నారు. సైఫ్ ఇంటికి వచ్చిన ఆయన... ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.
ముంబై అండర్ వరల్డ్ ను వణికించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దయాకు పేరుంది. దాదాపు 80 మందిని ఆయన ఎన్ కౌంటర్ చేసినట్టు సమాచారం. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ఆయనకు ఎంత గొప్ప పేరు ఉందో... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా అంతే అపఖ్యాతి ఉంది. దయా నాయక్ జీవిత కథ స్ఫూర్తితో బాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి. సైఫ్ పై దాడి కేసులో ఘటనను పరిశీలించడానికి దయా నాయక్ రావడంతో... అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.
