KTR: కేటీఆర్ కు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు... అరెస్ట్ పై తీవ్ర ఉత్కంఠ!

- ఫార్ములా ఈ-కార్ కేసులో ఈడీ విచారణ
- లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగే విచారణ కీలకం
- సాయంత్రం 6.30 వరకు విచారణ కొనసాగే అవకాశం
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు గంటలుగా ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. విచారణలో భాగంగా కేటీఆర్ పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మీ ఆదేశాల ప్రకారమే డబ్బులు బదిలీ అయ్యాయా? అని కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. మన కరెన్సీని పౌండ్స్ లోకి మార్చడంపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత జరిగే విచారణ కీలకంగా మారుతుందని సమాచారం. విచారణ తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? లేదా ఇంటికి పంపించేస్తారా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.