Palakollu MLA: వరి పొలంలో మందు పిచికారి చేసిన మంత్రి.. వీడియో ఇదిగో!

--
నిత్యం ఎన్నో పనులతో బిజీబిజీగా గడిపే మంత్రికి పండుగ సందర్భంగా కాస్త తీరిక చిక్కింది. సొంతూరు ఆగర్తిపాలెంలో ఉదయాన్నే పొలానికి వెళ్లి సామాన్య రైతులా మందు పిచికారి చేశారు. భుజాన మందు డబ్బాతో.. పొలంలో మందు పిచికారి చేస్తున్న మంత్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మంత్రిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతీ నాయకుడు ఇలా చేస్తే రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకోవచ్చని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
వ్యవసాయం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే నిమ్మల.. తొలినాళ్లలో కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. అప్పుడు కూడా తీరిక దొరికిన సమయంలో పొలం పనులు చేసేవారు. ఓవైపు లెక్చరర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే వ్యవసాయం చేసి ఎకరాకు 55 బస్తాల దిగుబడి తీశానని మంత్రి చెప్పారు. పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకుని జలవనరుల శాఖ అప్పగించారు.