Crime News: ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేకపోతోందని అత్తింటి వారి వేధింపులు.. మహిళ ఆత్మహత్య

- కేరళలోని మళప్పురంలో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య
- గతేడాది మేలో అబుదాబిలో పనిచేస్తున్న వాహబ్‌తో వివాహం
- కేవలం 22 రోజులు మాత్రమే కలిసున్న జంట
- ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న షహానా ముంతాజ్
ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేకపోవడమే ఆమెకు శాపమైంది. దానినే పట్టుకుని భర్త, అత్తింటివారు వేధించడంతో మనస్తాపం చెందిన 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మళప్పురంలో జరిగిందీ ఘటన. కాలేజీ విద్యార్థిని అయిన షహానా ముంతాజ్ ఈ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంగ్లిష్ రాదంటూ అత్తింటి వారు నిత్యం వేధిస్తుండటంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బీఎస్సీ మేథమేటిక్స్ ఫస్టియర్ విద్యార్థిని అయిన షహానాకు గతేడాది మేలో అబ్దుల్ వాహబ్‌తో వివాహమైంది. అబుదాబిలో పనిచేస్తున్న వాహబ్ తిరిగి అక్కడికి వెళ్లడానికి ముందు భార్యాభర్తలు ఇద్దరూ 22 రోజులు మాత్రమే కలిసున్నారు. ఆమె ఇంగ్లిష్ నైపుణ్యంపై వహాబ్ ఆమెను విమర్శించేవాడని, ఆమె ఫోన్ చేసినా ఎత్తకుండా టెక్స్ట్ మెసేజ్‌లతో హింసించేవాడని షహానా బంధువు ఆరోపించారు.
ఈ విషయాన్ని షహానా ఆమె మామయ్య దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వహాబ్‌కు నువ్వు తగిన దానివి కావని చెప్పేవాడని పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చెందిన షహానా ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.