Maha Kumbh Mela: కుంభమేళా ఎఫెక్ట్.. ఆకాశాన్నంటిన విమాన టికెట్ల ధరలు!

- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నాడు ప్రారంభమైన మహా కుంభమేళా
- ఈసారి 45 రోజుల పాటు జరగనున్న కుంభమేళా
- కుంభమేళాకు ప్రజలు పోటెత్తడంతో విమాన టికెట్లకు రెక్కలు
- ఏకంగా 500 శాతం వరకు పెరిగిన విమాన ఛార్జీ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నాడు (జనవరి 13న) మహా కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కలుపుకుని 40 కోట్ల మంది వరకు భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది.
అయితే, ఈ మహా కుంభమేళా కారణంగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ మధ్య విమాన టికెట్ రేట్లు 21 శాతం మేర పెరిగాయి. అలాగే భోపాల్, ప్రయాగ్‌రాజ్ మధ్య విమాన ఛార్జీలు గతేడాది రూ. 2,977గా ఉంటే... ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగి రూ. 17,796కు చేరింది.
అటు బెంగళూరు-ప్రయాగ్‌రాజ్ మధ్య కూడా విమాన టికెట్ రేట్లు భారీగానే పెరిగాయి. ఏకంగా 89 శాతం పెరిగి, రూ. 11,158కి చేరింది. అలాగే ముంబయి, ప్రయాగ్‌రాజ్ మధ్య విమాన టికెట్ ధరలు 13 శాతం పెరగడంతో రూ. 6,381కు చేరింది. అహ్మదాబాద్, ప్రయాగ్‌రాజ్‌ల మధ్య నడిచే విమానాల్లోనూ ఛార్జీలు 41 శాతం పెరిగినట్లు ఇక్సిగో పేర్కొంది.
ఇక ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఉన్న వారణాసి, లక్నో నగరాల నుంచి టికెట్ ధరలు 21 శాతం పెరిగినట్లు తెలిపింది. వారణాసి టికెట్లకు 127 శాతం డిమాండ్ పెరిగితే.. లక్నో టికెట్లకు 42 శాతం డిమాండ్ పెరిగింది. అలాగే సగటున విమాన సర్వీసుల బుకింగ్స్ లో 162 శాతం పెరుగుదల నమోదైంది.