UP Petrol Pump: హెల్మెట్ లేదని పెట్రోల్ పోయని బంక్ సిబ్బంది.. లైన్ మన్ ఏంచేశాడో మీరే చూడండి..!
- నేరుగా బంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గరకు వెళ్లిన లైన్ మన్
- పెట్రోల్ బంక్ కు విద్యుత్ సరఫరా తొలగించిన వైనం
- యూపీ పెట్రోల్ బంక్ లోని సీసీ కెమెరాలో రికార్డయిన లైన్ మన్ నిర్వాకం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ రూల్ వల్ల హాపూర్ లోని ఓ పెట్రోల్ బంక్ అంధకారంలో మునిగింది. ప్రభుత్వ రూల్ పేరు చెప్పి తన బైక్ లో పెట్రోల్ పోయలేదనే కోపంతో ఓ లైన్ మన్ ఆ బంక్ కు కరెంట్ సరఫరాను కట్ చేశాడు. ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి వైర్ కట్ చేసి చక్కా వెళ్లిపోయాడు. ఇదంతా బంక్ లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూపీలోని యోగి సర్కారు కొత్త ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ లలో ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ రూల్ అమలు చేస్తోంది. హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన బైకర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయొద్దని బంక్ యాజమాన్యాలను ఆదేశించింది. బంక్ ల సిబ్బంది కూడా ఈ రూల్ ను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హాపూర్ లోని ఓ బంక్ లోకి ఓ వ్యక్తి బైక్ పై వచ్చి పెట్రోల్ కొట్టాలని కోరాడు.
అయితే, ఆయన హెల్మెట్ ధరించకపోవడంతో ప్రభుత్వ రూల్ ప్రకారం పెట్రోల్ పోయబోమని చెప్పారు. ఈ మాటలతో ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి.. విద్యుత్ లైన్ మన్ అయిన తనకే పెట్రోల్ పోయనంటారా అంటూ బంక్ నుంచి వెళ్లిపోయాడు. బంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి బంక్ కు విద్యుత్ సరఫరా చేసే లైన్ ను తొలగించాడు. అనంతరం కిందకు దిగి బైక్ పై వెళ్లిపోయాడు. దీనిపై పెట్రోల బంక్ యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.