Anshu: డైరెక్టర్ త్రినాథరావు వ్యాఖ్యలపై అన్షు రియాక్షన్ ఇదే..!

Actress Anshu Reaction On Director Vulgar Comments

  • ఇక వదిలేయండి ప్లీజ్ అంటూ వీడియో విడుదల చేసిన నటి
  • త్రినాథరావు మంచి వ్యక్తి, చాలా స్నేహంగా ఉంటారని వివరణ
  • మజాకా విడుదల కోసం ఎదురుచూస్తున్నా అంటూ వ్యాఖ్య

మజాకా సినిమా టీజర్ లాంచ్ లో దర్శకుడు త్రినాథరావు నటి అన్షుపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. నటి శరీరాకృతి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వెంటనే స్పందించిన త్రినాథరావు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పారు. పొరపాటు జరిగిందని, తనను క్షమించాలని అన్షును కూడా కోరారు. అయితే, సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారడంతో వివాదం పూర్తిగా సమసిపోలేదు. ఈ నేపథ్యంలోనే నటి అన్షు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. 

డైరెక్టర్ త్రినాథ రావు చాలా మంచి వ్యక్తి అని, అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారని అన్షు చెప్పుకొచ్చారు. మజాకా సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్న 60 రోజులూ తనను ఓ కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారని చెప్పారు. ఆయనపై తనకు గౌరవం ఉందన్నారు. టాలీవుడ్‌లో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఇంతకంటే మంచి దర్శకుడు ఉండరేమోనని అన్షు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్‌ విషయంపై చర్చను ఇక ఆపేయాలని కోరుతూ ‘మజాకా’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అన్షు చెప్పారు.

More Telugu News