Mohanlal Badoli: హర్యానా బీజేపీ చీఫ్ మోహన్‌లాల్‌పై సామూహిక అత్యాచారం కేసు
- హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ హోటల్‌లో ఘటన
- సింగర్ రాకీతో కలిసి నేత అఘాయిత్యం
- ఆపై వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులు
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎఫ్ఐఆర్ కాపీ
- దర్యాప్తు ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ పోలీసులు
హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బదోలీ, సింగర్ జై భగవాన్ అలియాస్ రాకీలపై సామూహిక అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదైంది. హిమాచల్ ప్రదేశ్, సోలాన్ జిల్లాలోని కౌశాలిలోని ఓ హోటల్‌లో వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు వీడియో కూడా చిత్రీకరించారు. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారు. వీరిపై నమోదైన ఎఫ్ఐఆర్‌కు సంబంధించిన కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. బాధితురాలు తన బాస్, స్నేహితుడితో కలిసి హోటల్‌లో ఉండగా 2023 జులై 3న నిందితులు ఆమెను కలిశారు. బదోలీ తనను తాను రాజకీయ నేతగా, రాకీ సింగర్‌గా పరిచయం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బదోలీ, తన మ్యూజిక్ ఆల్బమ్స్‌లలో చాన్స్ ఇస్తానని రాకీ బాధితురాలికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడితో కలిసి వారి గదిలోకి వెళ్లింది. అక్కడ ఆమెతో వారు బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారు. అందుకామె అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగికదాడి ఘటనను వారు వీడియోలు, ఫొటోలు తీశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
రెండు నెలల క్రితం రాకీ తనను పంచకుల లోని ఆయన ఇంటికి పిలిచాడని, తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.