gavaskar: విదేశీ పర్యటనలకు టీమిండియాను ఒక గ్రూప్ గా పంపండి: గవాస్కర్

- మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్
- ఇంగ్లండ్‌తో సిరీస్‌కైనా ఒకేసారి జట్టును పంపించాలని సూచన
- ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన తప్పిదాలను పునరావృతం చేయొద్దని సలహా
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోవడం, పదేళ్ల తర్వాత ఆసీస్ విజేతగా నిలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కైనా ఒకేసారి జట్టును పంపించాలని సూచించారు. ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకూడదన్నారు. ఇంగ్లండ్‌తో ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున అప్పుడైనా ఒకే బృందంగా టీమిండియా వెళ్లాలన్నారు.
కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ లేకుండా బ్యాచ్‌లుగా వెళితే అక్కడి జట్టుకు మనం ఏమి సందేశం ఇస్తున్నట్లు? అని గవాస్కర్ ప్రశ్నించారు. ఆసీస్ ఓటమి తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. భారత జట్టు క్యాప్ తేలికగా ఇచ్చేస్తారనే భావన ప్రత్యర్ధి జట్టుకు రాకూడదన్నారు. కొంత మంది బౌలర్లను తీసుకుని వారికి జెర్సీ శిక్షణ ఇవ్వండి పర్లేదు, కానీ క్యాప్ మాత్రం ఇవ్వొద్దని గవాస్కర్ సలహా ఇచ్చారు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నాటికి భారత కెప్టెన్ రోహిత్ జట్టుతో చేరడం, టీమ్ కూడా రెండు విడతలుగా అక్కడకు వెళ్లడం, వ్యక్తిగత కారణాలతో రోహిత్ పెర్త్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోవడంపై అప్పుడే సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.