Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
- కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే ఫిర్యాదు
- నిన్న సాయంత్రం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈరోజు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. రెండు రోజుల క్రితం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్‌లో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.
అంతకుముందు, కరీంనగర్ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి నివాసానికి తరలించే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే హామీలను అమలుపరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.