youtuber: కుంభమేళాలో యూట్యూబర్ ను ఉతికారేసిన సాధువు
- మహా కుంభమేళాలో ఓ సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్
- పిచ్చి ప్రశ్నలు అడుగుతావా అంటూ యూట్యూబర్ పై సాధువు దాడి
- చిడతలతో సాధువు దాడి చేయడంతో యూట్యూబర్ పరార్
ఓ యూట్యూబర్‌ను సాథువు చిడతలతో చితక్కొట్టి తరిమిన ఘటన ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విషయంలోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున సాధువులు, కల్పవాసీలు పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం విచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ యూట్యూబర్ అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్న సాధువును ఇంటర్వ్యూ చేసే క్రమంలో తలతిక్క ప్రశ్నలు వేయడం సాధువుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సాధువు చిడతలను తీసుకుని యూట్యూబర్‌ను బాదడంతో అతను పరారయ్యాడు.
ఇంతకూ సాధువుకు ఎందుకు కోపం వచ్చిందంటే.. మీరు సాధువుగా ఎప్పుడు మారారు? అని యూట్యూబర్ ప్రశ్నించగా, చిన్నప్పుడే అని సమాధానం ఇచ్చాడు. యూట్యూబర్ అంతటితో ఆగకుండా దేవుడి కోసం మీరు ఏ భజనలు చేస్తారని ప్రశ్నించాడు. దీంతో తిక్కరేగిన సాధువు పక్కనే ఉన్న చిడతలను తీసుకుని పిచ్చిప్రశ్నలు అడుగుతావా? అంటూ వీరబాదుడు బాదడం లంకించుకున్నాడు. దీంతో సదరు యూట్యూబర్ సాధువు గుడారం నుంచి పారిపోయాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతరులు ఈ ఘటనను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయింది.