Russia War: ఉద్యోగం కోసం వెళ్లి.. రష్యా సైన్యంలో బలవంతంగా పనిచేస్తున్న భారతీయుడి మృతి

Indian killed while fighting on Russia Ukraine war

  • కేరళలోని త్రిసూర్ ‌కు చెందిన బినిల్, టీకే జైన్
  • ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి బలవంతంగా మిలటరీలోకి
  • వారిని రప్పించే ప్రయత్నాలు చేస్తుండగానే విషాదం
  • యుద్ధంలో బినిల్ మృతి.. జైన్‌కు గాయాలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ (32) మృతి చెందగా, ఆయన సమీప బంధువు టీకే జైన్ (27) గాయపడ్డాడు. యుద్ధంలో బినిల్ చనిపోయినట్టు రష్యా రాజధాని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపిందని ఆయన బంధువులు తెలిపారు. బినిల్‌ను రష్యా నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆయన భార్య అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

త్రిసూర్‌కు చెందిన బినిల్, టీకే జైన్ ఇద్దరూ ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగాల నిమిత్తం ఓ ఏజెంటు ద్వారా ప్రైవేటు వీసాలతో గతేడాది ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. అక్కడికి వెళ్లాక వీరి పాస్‌పోర్టులను రద్దు చేసిన అక్కడి అధికారులు రష్యా మిలటరీ సపోర్ట్ సర్వీస్‌లో భాగంగా యుద్ధానికి పంపారు. విషయం తెలిసి వారిని వెనక్కి రప్పించాలంటూ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వానికి విన్నవించారు. అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతుండగానే బినిల్ మరణించడం, జైన్ గాయాలపాలు కావడంతో స్వగ్రామంలో విషాదం అలముకుంది. 

More Telugu News