Sachin Pilot: ఎవరికి తెలుసు చంద్రబాబు, నితీశ్‌కుమార్ ఎప్పుడు చెయ్యిస్తారో?.. సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు తన మనసు ఎప్పుడు మార్చుకుంటారో తెలియదన్న కాంగ్రెస్ నేత
- నితీశ్‌కుమార్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చని వ్యాఖ్య
- ఒకప్పుడు 400 సీట్లు అన్నవారు ఇప్పుడు 240కే పరిమితమయ్యారంటూ మోదీపై విసుర్లు
- ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న వారే శాశ్వతంగా నిలుస్తారన్న సచిన్ పైలట్
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన మనసు ఎప్పుడు మార్చుకుంటారో, నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో ఎవరికి తెలుసని విమర్శించారు.
సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మంచీచెడులు ఉంటాయని సచిన్ పేర్కొన్నారు. కీర్తి అనేది తాత్కాలికమని, అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు.
400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారని పరోక్షంగా మోదీని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదని ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.