mahakumbh 2025: మహా కుంభమేళాకు తొలి రోజున 1.50 కోట్ల మంది హాజరు
- సోమవారం వైభవంగా ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా
- తొలిరోజు 1.50కోట్ల మంది భక్తుల పుష్కర స్నానాలు ఆచరించారన్న సీఎం యోగి ఆదిత్యనాథ్
- మహాకుంభ్ భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని చాటుతూ భిన్న సంస్కృతులను ఏకం చేస్తోందన్న యోగి
12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా ప్రారంభమైంది. మహా కుంభమేళాకు మొదటి రోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద దాదాపు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు.
సోమవారం పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్, హర్యానా, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వివిధ పుష్కర ఘాట్లు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలకు విచ్చేసిన సాధువులు, కల్పవాసీలు భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కుంభమేళాకు సంబంధించి వివరాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వరుస ట్వీట్‌లు చేశారు. మహా కుంభమేళా తొలి రోజు సనాతన ధర్మాన్ని ఆచరించే 1.50 కోట్ల మంది స్వచ్చమైన త్రివేణి జలాల్లో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేశారని యోగి పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మహాకుంభ్ భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని చాటుతూ భిన్న సంస్కృతులను ఏకం చేస్తోందని పేర్కొన్నారు. సంస్కృతీ సమ్మేళనం ఎక్కడుంటుందో విశ్వాసం, సామరస్యం అక్కడే ఉంటాయన్నారు. ప్రయాగ్‌రాజ్ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని రాసుకొచ్చారు.