Nishesh Basavareddy: ఆస్ట్రేలియన్ ఓపెన్: జకోవిచ్ పై పోరాడి ఓడిన మన 'నెల్లూరు' బసవారెడ్డి
- ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నేడు జకోవిచ్ × నిశేష్ బసవారెడ్డి
- 6-4, 3-6, 4-6, 2-6తో ఓటమిపాలైన తెలుగు సంతతి కుర్రాడు
- తొలి సెట్ గెలిచినప్పటికీ, రెండో సెట్లో గాయం
- వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్ కైవసం చేసుకున్న జకోవిచ్
- నిశేష్ తనను ఆశ్చర్యపరిచాడన్న మాజీ వరల్డ్ నెంబర్ వన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఈసారి తెలుగు మూలాలున్న అమెరికన్ టీనేజి కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి పేరు నిశేష్ బసవారెడ్డి. నిశేష్ కుటుంబం ఏపీలోని నెల్లూరు నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ ను ఆదర్శంగా తీసుకుని టెన్నిస్ బాట పట్టిన నిశేష్ బసవారెడ్డి ఇవాళ తన ఆరాధ్య హీరోతో తలపడడం విశేషం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో నేడు జకోవిచ్, బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ మ్యాచ్ జరిగింది. పెద్దగా గ్రాండ్ స్లామ్ అనుభవం లేనప్పటికీ, తెలుగు సంతతి కుర్రాడు బసవారెడ్డి మాజీ వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి సెట్ ను 6-4తో చేజిక్కించుకున్న బసవారెడ్డి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
జకోవిచ్ వంటి ఆటగాడి సర్వీసును బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే, 19 ఏళ్ల బసవారెడ్డి తొలి సెట్ లో నమ్మశక్యం కాని ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ రెండో సెట్ లో గాయపడడం అతడి ఆటపై ప్రభావం చూపింది. చివరికి జకోవిచ్ దే పైచేయి అయింది. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ... తన అనుభవాన్ని ఉపయోగించిన జకో వరుసగా మూడు సెట్లలో నెగ్గి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు. తద్వారా రెండో రౌండ్ లో అడుగుపెట్టాడు.
దాదాపు 3 గంటల పాటు సాగిన నేటి మ్యాచ్ లో బసవారెడ్డి 6-4, 3-6, 4-6, 2-6తో ఓటమిపాలయ్యాడు.
మ్యాచ్ పూర్తయ్యాక జకోవిచ్ తన ప్రత్యర్థి నిశేష్ బసవారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ చివరి వరకు అతడు కనబర్చిన పోరాట పటిమ తనను ఆకట్టుకుందని అన్నాడు. కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న అతడు తనను ఆశ్చర్యానికి గురిచేశాడని వెల్లడించాడు. కెరీర్ లో అతడు అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.