AP Govt: ఆ ఉద్యోగులకు సంక్రాంతి సెలవు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
- ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులకు ఎల్లుండి కూడా సెలవు
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్
- బ్యాంకు యూనియన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం
ప్రభుత్వరంగ బ్యాంకులకు సంక్రాంతి సెలవుల విషయంలో ఏపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఉద్యోగులకు మరో రోజు సెలవు పొడిగించింది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
2025 ప్రభుత్వ సెలవుల్లో ఏపీ ప్రభుత్వరంగ బ్యాంకులకు జనవరి 14న మాత్రమే సంక్రాంతి సెలవుగా ప్రకటించారు. కనుమ రోజు (బుధవారం) బ్యాంకులు యథావిధిగా పనిచేయాలి. దీంతో ఏపీ సర్కార్‌ను యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనియన్ ఎల్లుండి కనుమ నాడు కూడా సెలవు ప్రకటించాలని విన్నవించాయి.
యూనియన్ల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం... బ్యాంకులకు అదనంగా మరో రోజు కూడా సెలవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నెం.2116ను సవరించి, ఈరోజు కొత్తగా జీవో నెం.73ను ప్రభుత్వం విడుదల చేసింది.