India vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్ క్రికెట్ పోరుపై డాక్యుమెంటరీ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- క్రికెట్ చరిత్రలో దాయాదుల పోరుపై 'నెట్‌ఫ్లిక్స్' కొత్త డాక్యుమెంటరీ
- దీనికి 'ది గ్రేట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' అనే టైటిల్
- ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న డాక్యుమెంటరీ
క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే దానినో యుద్ధంలా చూస్తారు. క్రికెట్ చరిత్రలో దాయాదుల పోరు గురించి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది ఇంతకుముందు భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ అని తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ దీనికి 'ది గ్రేట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' అనే టైటిల్ పెట్టింది. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేందుకు వెళుతున్న ప్రత్యేక పోస్టర్‌ను కూడా పంచుకుంది. ఫిబ్రవరి 7 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.
కాగా, వచ్చే నెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఇది స్ట్రీమింగ్ కానుండడం గమనార్హం. ఇక ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దాయాది పోరు ఉన్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దాయాది పోరుతో పాటు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి.