Mallu Bhatti Vikramarka: వాటి ఆధారంగా రైతు భరోసా ఇస్తాం: మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Mallu Bhattivikramarka on Rythu Bharosa

  • పథకాల అమలులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్న భట్టివిక్రమార్క
  • వ్యవసాయ యోగ్యత కలిగిన భూములకు ఎకరాకు రూ.12 వేలు చెల్లిస్తామని వెల్లడి
  • జాబ్ కార్డు తీసుకొని, 20 రోజులు పని చేసి ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని వెల్లడి

రైతు భరోసాపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.2,000 కోట్లు, రైతు భరోసాకు రూ.19 వేల కోట్ల చొప్పున ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ఈ పథకాల అమలులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు.

లబ్ధిదారుల ఎంపిక, అమలుకు విధివిధానాలు లోతుగా చర్చించాకే కేబినెట్ ప్రకటన చేసినట్లు చెప్పారు. వ్యవసాయ యోగ్యత కలిగిన భూములన్నింటికి ఎకరాకు రూ.12 వేలు చెల్లిస్తామన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి, సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందుతుందన్నారు.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా పూర్తిగా అర్హులనే ఎంపిక చేస్తామన్నారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను అధికారులు వెల్లడించాలన్నారు. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, ఖరారు జరుగుతుందన్నారు. గ్రామ సభల్లోని అర్హులైన వారికి పథకాల అనుమతి పత్రాలు అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేస్తారన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? లేదా? అనేది ఇందిరమ్మ కమిటీలు పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు కీలకమన్నారు.

  • Loading...

More Telugu News