Omar Abdullah: ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేసిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

Jammu and Kashmir CM Omar Abdullah praises PM Modi

  • ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మోదీ నెరవేరుస్తున్నారన్న ఒమర్ అబ్దుల్లా
  • జడ్ మోడ్ టన్నెల్ ను చాలా వేగంగా పూర్తి చేశారని ప్రశంస
  • మోదీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతి నెలకొందని కితాబు
  • జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్న సీఎం
  • జమ్మూకశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని విన్నపం

జమ్ముకశ్మీర్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా గాందర్ బల్ జిల్లాలో నిర్మించిన జడ్ మోడ్ టన్నెల్ ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మీరు నెరవేస్తున్నారని కొనియాడారు. కశ్మీర్-ఢిల్లీల మధ్య అంతరాన్ని తగ్గించారని చెప్పారు. ఈ సొరంగ మార్గాన్ని మీరు ప్రారంభించడం మా అదృష్టమని అన్నారు. ఈ ప్రాజెక్టులో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని... కానీ మీరు, నితిన్ గడ్కరీ ఈ పనిని వేగంగా పూర్తి చేశారని కితాబిచ్చారు. 

సొరంగ మార్గం పూర్తి కావడం వల్ల ఇకపై సంవత్సరం పొడవునా ఇక్కడకు పర్యాటకులు వస్తారని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు సైతం ప్రజలు చేరుకునే వీలు కలిగిందని అన్నారు. సోనామార్గ్ కు కూడా చాలా మంది వస్తారని చెప్పారు. జోజిలా సొరంగ మార్గం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు.

మోదీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతి నెలకొందని ఒమర్ అబ్బుల్లా అన్నారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, రిగ్గింగ్ లు జరిగినట్టు ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఈ ఘనత మోదీకి, ఎన్నికల కమిషన్ కు చెందుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం గురించి కూడా ఆలోచించాలని ప్రధానిని కోరారు.

  • Loading...

More Telugu News