Ajith Kumar: హీరో అజిత్ కు కంగ్రాట్స్ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- దుబాయ్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ టీమ్ కు 3వ స్థానం
- పోడియం ఫినిష్ సాధించడంతో అజిత్ పై సర్వత్రా ప్రశంసలు
- నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ పవన్ స్పందన
దుబాయ్ 24హెచ్ కార్ రేసింగ్ ఈవెంట్ లో తమిళ హీరో అజిత్ కుమార్ టీమ్ 3వ స్థానం కైవసం చేసుకోవడం తెలిసిందే. దాంతో అజిత్ పై అభినందనల జడివాన కురుస్తోంది. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరో అజిత్ ను అభినందించారు.
"దుబాయ్ 24హెచ్ రేసింగ్ పోటీలో 991 కేటగిరీలో మూడో స్థానం, జీటీ4 కేటగిరీలో 'స్పిరిట్ ఆఫ్ ద రేస్' అవార్డు కైవసం చేసుకున్న అజిత్ కుమార్, ఆయన టీమ్ కు హృదయపూర్వక శుభాభినందనలు. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి గొప్ప పట్టుదలతో రేసులో గెలిచి భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీరు, మీ జట్టు మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.