KCR: కేసీఆర్ సంక్రాంతి సందేశం.. ప్రజలకు శుభాకాంక్షలు.. ప్రభుత్వానికి హితవు

- దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చామన్న మాజీ సీఎం
- వ్యవసాయానికి, రైతన్నకు పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని వెల్లడి
- రైతు సంక్షేమ పథకాలను కొనసాగించాలని కాంగ్రెస్ సర్కారుకు హితవు
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు, వ్యవసాయానికి సంక్రాంతి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగేలా చూడాలంటూ పకృతి మాతను ప్రార్థించారు. వ్యవసాయానికి, రైతన్న సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, దేశంలో మరే ప్రభుత్వమూ రైతుల సంక్షేమం కోసం తమలాగా పాటుపడలేదని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు.
తమ పాలనలో రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. నూతన రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంగా గడపాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడిందని చెప్పారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా చేసి చూపించామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, వాటిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చేలా నడుచుకోవాలని చెప్పారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణ వేగంగా సత్ఫలితాలను ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. రైతుల సంక్షేమం కోసం నాడు 24 గంటల ఉచిత విద్యుత్, పంట పొలాలకు నీరందించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల ద్వారా సాగు నీరు అందించడం, పెట్టుబడి కోసం రైతు బంధు, రైతన్నల కుటుంబాలను ఆదుకోవడానికి రైతు బీమా తదితర సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేశామని వివరించారు.
ఈ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ముందంజలో నిలిపామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఇటు దేశానికి, అటు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కులవృత్తులను ప్రోత్సహించామని, సబ్బండ కులాలకు ఆర్థిక సహకారం అందించి వారి జీవితాల్లో శోభ నింపామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.