ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
- ఫిబ్రవరి 19 నుంచి పాక్, యూఏఈలలో ఛాంపియన్స్ ట్రోఫీ
- 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
- పాట్ కమ్మిన్స్ ను జట్టుకు సారథిగా ఎంచుకున్న ఆసీస్
- మంచి ఆల్‌రౌండర్లు, నాణ్యమైన పేసర్లు, స్టార్ బ్యాటర్లతో స్ట్రాంగ్‌గా ఆసీస్ జట్టు
ఎనిమిది దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
పాట్ కమ్మిన్స్ ను జట్టుకు సారథిగా ఎంచుకుంది. ఇటీవల బీజీటీ సిరీస్‌లో గాయపడిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా సోమవారం ప్రకటించిన జట్టులో ఉన్నాడు. గాయం కారణంగా భారత్‌తో జరిగిన ఐదు మ్యాచుల సిరీస్‌లో కేవలం రెండు టెస్టులకే పరిమితమైన ఈ స్టార్ ప్లేయర్ తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు.
అలాగే ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ కు కూడా జట్టులో చోటు దక్కింది. పాకిస్థాన్‌తో జరిగిన ఇటీవలి వన్డే సిరీస్‌లో పేలవమైన ఫామ్ తో జట్టుకు దూరమైన ఈ యువ ఆటగాడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. మొత్తంగా మంచి ఆల్‌రౌండర్లు, నాణ్యమైన పేసర్లు, స్టార్ బ్యాటర్లతో ఆసీస్ జట్టు స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.
"ఇది 2023 వన్డే ప్రపంచ కప్, వెస్టిండీస్ సిరీస్, గతేడాది ఇంగ్లండ్‌లో విజయవంతమైన జట్టు, ఇటీవలి పాకిస్థాన్ హోమ్ సిరీస్‌లలో సక్సెస్ అయిన ఆటగాళ్లతో కూడిన సమతుల్య, అనుభవజ్ఞులైన జట్టు. పాక్‌లోని పరిస్థితులకు అనుగుణంగా అనేక చర్చల తర్వాత ఎంపిక చేసిన బెస్ట్ టీమ్" అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ అన్నారు.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడం జంపా, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్.