Wildfire: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు.. సందట్లో సడేమియాలు

- మంటలు ఎగసి పడుతుండడంతో ఇళ్లను వదిలేసి వెళుతున్న జనం
- ఖాళీ ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళుతున్న దొంగలు
- అగ్నిమాపక సిబ్బంది వేషంలో దొంగతనం చేస్తున్న యువకుడు
అమెరికాలో ఓవైపు కార్చిచ్చు ఇళ్లను బూడిదకుప్పలుగా మారుస్తుండగా మరోవైపు దొంగలు చెలరేగిపోతున్నారు. మంటలు విస్తరిస్తుండడంతో ప్రాణభయంతో జనం ఇల్లూవాకిలి వదిలి పారిపోతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు దొంగలు దీనిని అవకాశంగా మలుచుకుంటున్నారు. యజమానులు వదిలేసి వెళ్లిన ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళుతున్నారు. దీంతో స్థానిక పోలీసులకు అటు జనాలను రక్షించడంతో పాటు ఇటు దొంగతనాలను అరికట్టాల్సి రావడం తలనొప్పిగా మారింది. దీంతో మంటలు విస్తరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆ ఏరియాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది మినహా ఎవరూ ఉండొద్దని, ఎవరైనా కనిపిస్తే అరెస్టు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.
శనివారం రాత్రి వరకు ఇలా ఇరవై తొమ్మిది మందిని అరెస్టు చేశామని, ఇందులో ముగ్గురు వ్యక్తులు దొంగతనం చేస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. తాజాగా ఓ దొంగ పోలీసుల కళ్లుగప్పేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది వేషం ధరించాడు. మిగతావారిలాగే మంటలు ఆర్పుతున్నట్లు నటిస్తూ ఇళ్లల్లోకి వెళ్లి విలువైన వస్తువులను మాయం చేస్తున్నాడు. ఓ పోలీస్ అధికారికి సందేహం వచ్చి ఆరాతీయడంతో దొంగ అసలు రూపం బయటపడింది. దీంతో ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 26 కు చేరిందని అధికారులు తెలిపారు. మంటలు ఇంకా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. కార్చిచ్చుకు పెనుగాలులు తోడవడంతో మంటలను అదుపుచేయడం కష్టంగా మారిందన్నారు.