Supari Killings: ప్రియురాలి భర్తను చంపించేందుకు సుపారీ.. పొరబడి క్యాబ్ డ్రైవర్ ను చంపిన కిల్లర్
- ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దారుణం
- మృతదేహాన్ని నాలాలో పడేసి వెళ్లిన హంతకుడు
- పోలీసుల దర్యాఫ్తులో బయటపడ్డ అసలు విషయం
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఘోరం చోటుచేసుకుంది. ప్రియురాలి భర్తను, ఆయన తండ్రిని చంపించేందుకు ఓ వ్యక్తి సుపారీ ఇవ్వగా.. కాంట్రాక్ట్ కిల్లర్ పొరపాటున వేరే వ్యక్తిని చంపేశాడు. నాలాలో మృతదేహం గుర్తించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి కాంట్రాక్ట్ కిల్లర్ ను పట్టుకున్నారు. విచారణలో ప్రియుడి నిర్వాకం బయటపడడంతో మొత్తం ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
లక్నోలోని మాదేహ్ గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్తాబ్ అహ్మద్ అనే వ్యక్తికి స్థానికంగా ఉండే ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఇద్దరూ చాటుమాటుగా కలుసుకుని సంతోషిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రియురాలి భర్త, ఆయన తండ్రి తనకు అడ్డుగా ఉన్నారని భావించిన అఫ్తాబ్.. వారిద్దరిని చంపించేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం యాసిర్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. యాసిర్ తనతో పాటు కృష్ణకాంత్ అనే వ్యక్తిని కలుపుకుని హత్యలకు ప్రణాళిక రచించాడు.
ప్లాన్ ప్రకారం గతేడాది డిసెంబర్ 30న నాటు తుపాకీతో మాదేహ్ గంజ్ చేరుకున్నారు. అయితే, పొరపాటున ఓ క్యాబ్ డ్రైవర్ ను కాల్చి చంపారు. ఆపై మృతదేహాన్ని నాలాలో పడేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు యాసిర్ ను, కృష్ణకాంత్ ను పట్టుకుని విచారించగా అఫ్తాబ్ ప్లాన్ బయటపడింది.