Los Angeles: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు.. తప్పిపోయిన కుక్క తిరిగి రావడంతో ఎగిరి గంతేసిన యజమాని.. వీడియో ఇదిగో!
--
అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు వేలాది ఇళ్లను బూడిద చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా మంటలు ఇప్పటికీ అదుపులోకి రావడంలేదు. మంటలు విస్తరిస్తుండడంతో జనం ఇల్లూవాకిలి వదిలి ఉన్నపళంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రాణభయంతో పరుగులు పెట్టే క్రమంలో విలువైన వస్తువులను అలాగే వదిలేసి వెళుతున్నారు. బతికుంటే చాలు అనుకుంటూ చేతికందిన వాహనంలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా సంపన్నులు నివాసం ఉండే పసిఫిక్ పాలిసేడ్స్ ఏరియాలో కార్చిచ్చు ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ఏరియాలోని ఓ బిల్డింగ్ యజమాని కాల్విన్ కార్చిచ్చు రేగిన సమయంలో ఇంట్లో లేడు. మంటలు విస్తరించడంతో లాస్ ఏంజెలెస్ అధికారులు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టారు. అటువైపు ఎవరినీ వెళ్లనివ్వలేదు. దీంతో కాల్విన్ తను ప్రేమగా పెంచుకుంటున్న శునకాన్ని రక్షించుకోలేకపోయాడు. మంటల్లో ఆయన ఇల్లుతో పాటు ఆ ఏరియా మొత్తం కూడా కాలిబూడిదయ్యింది. ఆ మంటల్లో పడి తన పెంపుడు శునకం చనిపోయిందని కాల్విన్ కన్నీటిపర్యంతమయ్యాడు. మంటలు కాస్త తగ్గుముఖం పట్టాక తన ఇంటివైపు వెళ్లిన కాల్విన్.. తన పెంపుడు శునకం ఆనవాళ్ల కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఇంతలో తన పెంపుడు శునకం పరిగెత్తుకుంటూ రావడం చూసి కాల్విన్ సంతోషం పట్టలేకపోయాడు. శునకాన్ని ఎత్తుకుని ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. కన్నీళ్లతో దానిని ముద్దాడుతూ, సంతోషంతో ఆయన గంతులు వేస్తున్న దృశ్యాలను లాస్ ఏంజెలిస్ టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.