Karun Nair: 8 ఏళ్లక్రితం జట్టుకు దూరం.. ఇప్పుడు దుమ్మురేపుతున్నాడు.. ఎటూ పాలుపోని పరిస్థితిలో సెలక్టర్లు
- విజయ్‌హజారే ట్రోఫీలో అదరగొడుతున్న కరుణ్ నాయర్
- ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు బాదిన క్రికెటర్
- ఒక్కసారి కూడా ఔట్ కాకుండా భారీ స్కోర్లు
- సెలక్టర్లు తనవైపు చూసేలా చేసిన క్రికెటర్
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై 303 పరుగుల భారీ స్కోర్ సాధించిన ట్రాక్ రికార్డు అతడిది. అయితే, పరిస్థితులన్నీ తలకిందులై దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడూ సెలక్టర్లు అతడిని పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. దీంతో, ‘ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్’ అంటూ 2022లో సెలక్టర్లను వేడుకున్నాడు. అయినా పరిగణించలేదు. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా పరుగుల వరద పారిస్తూ ప్రస్తుతం సెలక్టర్లు విస్మరించలేని పరిస్థితులు సృష్టించాడు. అతడే కరుణ్ నాయర్!
దేశవాళీ క్రికెట్‌లో అత్యంత గుర్తింపు కలిగిన ‘విజయ్ హజారే’ ట్రోఫీలో కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ ట్రోఫీలో గత 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 600లకుపైగా పరుగులు సాధించాడు. వరుసగా 112, 44, 163, 111, 112, 122 స్కోర్లు సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కరుణ్ నాయర్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో కరుణ్ నాయర్ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు, ఈ సీజన్‌లో 5 సెంచరీలు సాధించిన నాయర్... ఒకే ఎడిషన్‌లో అత్యధిక శతకాలు సాధించిన తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీశన్‌తో సమంగా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. విజయ్‌హజారే ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే వరుసగా నాలుగు సెంచరీలు సాధించగా అందులో నాయర్ ఒకడు కావడం విశేషం.
‘ఇంకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్’ అని తాను ట్వీట్ చేసినప్పుడు బాగా భావోద్వేగానికి గురయ్యానని కరుణ్ నాయర్ తెలిపాడు. సెలక్టర్లు తనను విస్మరించకూడదని బలంగా భావించానని, అందుకోసం పరుగులు సాధించాలని నిర్ణయించుకొని బాగా కష్టపడ్డానని కరుణ్ నాయర్ తెలిపాడు. మరో అవకాశం కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నానని చెప్పాడు. విదర్భ తరపున ఆడుతున్న నాయర్ రాజస్థాన్‌పై అజేయ 122 స్కోర్ సాధించిన అనంతరం ఈ విధంగా స్పందించాడు.