bhogi celebrations: తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి

- గ్రామాలు, పట్టణాల్లో మొదలైన సంక్రాంతి సందడి
- భోగి మంటల వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న పెద్దలు, పిన్నలు
- సంప్రదాయ దుస్తుల్లో యువతీ యువకుల సందడి
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. భోగి పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ప్రజలు సందడి చేశారు. గ్రామాల్లో, నగరాల్లో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకున్నారు. మహిళలు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తున్నాయి.
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగర వాసులు స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మరోపక్క ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.


