Jagan: తొక్కిసలాట ఘటనపై కూటమి ప్రభుత్వ తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది: జగన్

Jagan take a jibe at aliance govt on Tirupati stumpede

  • ఇటీవల తిరుమలలో తొక్కిసలాట
  • ఆరుగురు శ్రీవారి భక్తుల మృతి
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జగన్

తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ  ప్రఖ్యాతి గాంచిన టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారని, కానీ ఈ ఘటనకు బాధ్యులపై చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని విమర్శించారు. 

ఈ ఘటనలో చంద్రబాబు నిర్లక్ష్యం ఉందని... టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలపై పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యం ఉందని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు పోలీసులందరినీ  తన కుప్పం పర్యటనలో పెట్టుకున్నారని ఆరోపించారు. 

టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యం ఉందని విచారణలో తేలినప్పటికీ, వారిని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దానర్థం ఏమిటి.. ఈ ఘటనను చంద్రబాబు ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందనే కదా అర్థం అని జగన్ ధ్వజమెత్తారు. సంబంధం లేని వారి సస్పెండ్ చేశారని, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని బదిలీతో సరిపెట్టారని, కొందరిపై అసలు చర్యలే లేవని విమర్శించారు. 

సీఎం ఈ ఘటనపై తూతూమంత్రంగా చర్యలు తీసుకుని అదే పెద్ద శిక్ష అన్నట్టుగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెబితే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు... క్షమాపణ చెబితే సరిపోతుందా... శ్రీవారి భక్తులకు ఇచ్చే విలువ ఇదేనా? ఇకనైనా సీఎం, డిప్యూటీ సీఎం చిత్తశుద్ధితో వ్యవహరించి... ఈ తొక్కిసలాటకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తద్వారా దేవుడిపై మీ భక్తిని చాటుకోండి... లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాకతప్పదని జగన్ హెచ్చరించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News